కాకినాడకు చెందిన తెలుగుదేశం నేత, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, వీర వెంకట సత్యనారాయణల కుమారుడు పిల్లి కృష్ణప్రసాద్ (బుజ్జి) ఈజీ మనీకి అలవాటు పడి మోసాలు చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో చెలామణిలో లేని టర్కిష్ కరెన్సీ అంటగట్టేందుకు ప్రయత్నించాడు. ఈ వ్యవహారంలో బుజ్జి, మరో ఐదుగురిపై హైదరాబాద్ ఎల్బీ నగర్ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. ఏలూరుకు చెందిన మంచినీళ్ల ఓం నాగప్రసాద్, దెందులూరు మండలానికి చెందిన గుండిమీద జ్యోతి రవితేజ, ఆనందరావుపేటకు చెందిన తోట వెంకటనాగరాజు, కాకినాడకు చెందిన నిమ్మగంటి జీవన్సత్య, ఇంద్రపాలానికి చెందిన మర్కుటి తేజలను అరెస్టు చేశారు. కాకినాడకే చెందిన పులి బుజ్జి పరారీలో ఉన్నట్లు తెలిపారు. పోలీసుల వెల్లడించిన మేరకు వివరాలిలా ఉన్నాయి. టర్కీకి చెందిన లీరా కరెన్సీని ఆ దేశం కొన్ని సంవత్సరాల క్రితం రద్దు చేసింది.
కార్పెంటర్ అయిన ఓం నాగప్రసాద్‌కు ఎనిమిదేళ్ల క్రితం 99 పాత లీరా నోట్లు ఏలూరుకు చెందిన ఓ గుర్తుతెలియని వ్యక్తి ద్వారా లభించాయి. అప్పటి నుంచి వీటిని భారత కరెన్సీగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కొన్నిరోజుల క్రితం ఇతడికి ఏలూరులోనే రవితేజ, నాగరాజుతో పరిచయమైంది. నాగప్రసాద్ కరెన్సీ విషయం వారికి చెప్పి, మార్పిడి చేయిస్తే కమీషన్ ఇస్తానన్నాడు. వారిద్దరూ ఈ విషయాన్ని పిల్లి బుజ్జికి చెప్పారు. హైదరాబాద్‌లో ఉన్న పరిచయాలతో టర్కిష్ కరెన్సీ మారుస్తానని బుజ్జి చెప్పాడు. లీరాలు చెలామణిలో లేవనే విషయం తెలిసినప్పటికీ తక్కువ రేటుకు ఇస్తామంటూ మోసం చేయాలని భావించాడు. తన స్నేహితులు జీవన్సత్య, తేజలను రంగంలోకి దింపాడు. పథకం ప్రకారం ఈ ఆరుగురూ అద్దె కారులో హైదరాబాద్ చేరుకుని గచ్చిబౌలిలోని ఓ లాడ్జిలో దిగారు. 99 లీరాల విలువ భారత కరెన్సీలో రూ.27 కోట్లు ఉంటుందని, వాటిని రూ.కోటికే ఇస్తామంటూ పలువురికి చెప్పారు. ఈ విషయం ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ గ్యాంగ్ గురువారం చింతల్‌కుంట వద్దకు రాగానే ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి బుజ్జి మినహా ఐదుగురిని పట్టుకున్నారు. కారు, 99 లీరాలు, స్వాధీనం చేసుకున్నారు. అయితే, గచ్చిబౌలిలోని లాడ్జిలో బస చేసిన పిల్లి కృష్ణప్రసాద్ (బుజ్జి) చిక్కకపోవడం, అతడిని ఆరో నిందితుడిగా చేర్చి పరారీలో ఉన్నాడని చెప్పడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో మోసం చేయాలని చూసిన కేసులో కీలకంగా ఉన్న టీడీపీ నేత కుమారుడు అరెస్ట్ కాకపోవడం వెనుక అధికార పార్టీ హస్తం ఉందని ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక ఆంధ్రా తెలుగుదేశం పార్టీ నాయకులు ఓవరాక్షన్ ఎక్కువైంది. మావాడే సీఎం అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.