ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డు సృష్టించిన మిచెల్ స్టార్క్ తన తాజా ప్రదర్శనతో ట్రోలర్ల చేతికి చిక్కాడు. సన్‌రైజర్స్‌పై చేసిన దారుణ ప్రదర్శన కారణంగా స్టార్క్ పై సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్ రావడం గమనార్హం. తొలి మ్యాచ్ లో నాలుగు ఓవర్లు వేసిన స్టార్క్ 53 పరుగులు సమర్పించుకుని ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దీంతో సోషల్ మీడియాలో స్టార్క్ పై మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి.
ఐపీఎల్ వేలంలో మిచెల్ స్టార్క్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ 24.75 కోట్లు వెచ్చించి కొనుగోలు చేయడం విశేషం. కానీ తొలి మ్యాచ్ లోనే తేలిపోవడంతో క్రికెట్ అభిమానులు స్టార్క్ పై విరుచుకుపడుతున్నారు. తనకంటే తక్కువ ధర పలికిన ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్నారని కానీ సస్టార్క్ మాత్రం విఫలమయ్యాడని విమర్శిస్తున్నారు. కాగా ఒక్క మ్యాచ్ ద్వారా ప్రతిభని అంచనా వేయకూడదని స్టార్క్ కొత్తగా తనని తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేదని మరికొందరు స్టార్క్ కు వత్తాసు పలుకుతున్నారు.
కాగా సన్‌రైజర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఓటమి అంచులనుండి బయటపడింది. చివరి ఓవర్ లో యువ పేసర్ హర్షిత్ రాణా అద్భుత బౌలింగ్ చేసి 2 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీయడంతో కేకేఆర్ సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న స్టార్క్ పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.