విజయవాడ తూర్పు నియోజకవర్గం ప్రస్తుత శాసన సభ్యుడు గద్దె రామ్మోహన్ రావు నియోజక వర్గానికి చేసింది శూన్యం అని విజయవాడ తూర్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దేవినేని అవినాష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రిటైనింగ్ వాల్ మొదలుపెట్టి పూర్తి చేస్తే ఇప్పుడు నిస్సిగ్గుగా అక్కడ వీడియోలు తీసుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. తూర్పు నియోజకవర్గ ప్రజలు 10 సంవత్సరాలు అధికారం ఇస్తే వారికి మంచి చేసిన పాపాన పోలేదని అన్నారు.
కరోనా సమయంలో ఇంటికి పరిమితమైన గద్దె రామ్మోహన్ రావు ఈరోజు ఎన్నికల వేళ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, ఎన్నికలు ఉంటే గాని ప్రజలు గుర్తుకు రారా అని దేవినేని అవినాష్ ప్రశ్నించారు. 2014 నుంచి 2019 దాకా చేసిన అభివృద్ధి అంటే చెప్పాలని అడిగారు. రిటైనింగ్ వాల్ టిడిపి హయాంలో కట్టామని చెప్పుకుంటున్న గద్దె రామ్మోహన్ రావు 2019, 2020 సంవత్సరాలలో ప్రజలను ఎందుకు సహాయ కేంద్రాలకు తరలించాల్సి వచ్చిందని అడిగారు. గతంలో తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి కార్పొరేటర్లు గెలిచిన చోట అభివృద్ధికి రూపాయి కూడా కేటాయించలేదు అని తెలిపారు. ఈ ప్రభుత్వంలో ఏ పార్టీ అని చూడలేదని అభివృద్ధి ఆకాంక్షతోనే నియోజక వర్గం మొత్తం అభివృద్ధి చేసామన్నారు. నాలుగు సంవత్సరాలు కాలంలో నాలుగు సార్లు ప్రతి గడపకు వెళ్లి వారి సమస్యలు ఏంటో తెలుసుకొని పరిష్కరించామని అని తెలిపారు. ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగింది అనేది ప్రజలకి స్పష్టంగా తెలుసని రానున్న ఎన్నికల్లో కచ్చితంగా వైఎస్ఆర్సిపి జెండా ఇక్కడ నిలబెడతామని దేవినేని అవినాష్ అన్నారు.