రాష్ట్రంలో ఎన్నికలు అంటే బెట్టింగ్ రాయుళ్లకి చేతినిడండా పని తయారైంది. ఎన్నికలకి నెలరోజుల ముందునుండే బెట్టింగ్ రాయుళ్ళు రంగంలోకి దిగిపోయి వివిధ అంశాలపై బెట్టింగులకి తెరలేపుతున్నారు. ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు? ఎవరి మెజారిటీ ఎంత ? ఏ ప్రాంతంలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి లాంటి అనేక అంశాలపై బెట్టింగులు జోరుగానే సాగాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈసారి బెట్టింగుల్లో హాట్ టాపిప్ గా మారింది మాత్రం పవన్ కళ్యాణ్ , జనసేన పార్టీలే అనే అభిప్రాయం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వినిపిస్తున్న మాట.
పార్టీ పెట్టి పదేళ్ళు దాటినా ఇప్పటి వరకు గెలుపు మొహం చూడలేకపోయిన పవన్ కళ్యాణ్ ఈసారైనా గెలుస్తారా లేక మళ్ళీ ఓటమి బాటనే పడతారా అనే చర్చ తీవ్ర స్థాయిలో జరుగుతుంది. పిఠాపురం అసెంబ్లీ సెగ్మెంట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో హాట్ టాపిక్ గా మారింది. ఈ సారి ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో ఆయన సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న పిఠాపురాన్ని పవన్ ఎంచుకున్నారనే వాదన ఉంది. అయితే పవన్ కి ప్రత్యర్ధిగా అదే సామాజిక వర్గానికి చెందిన వంగా గీత గారు నిలబడటంతో గెలుపు అంత సులభం కాదనే వాదన ఉంది.
ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బెట్టింగులకి పిఠాపురం కేంద్రబిందువు అయిందని చెబుతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ , జనసేనపై పలు అంశాలు ఆధారంగా పందాలు జోరుగా సాగుతున్నాయి. గతంలో రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూటమిని గెలిపిస్తాడా? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడా ఓడిపోతాడా? పిఠాపురంలో పవన్ మెజారిటీ ఎంతా ? పిఠాపురంలో వంగా గీత మెజారిటీ ఎంత? 21 స్థానాల్లో పవన్ గెలిచే స్థానాలు ఎన్ని ? ఇలా అనేక అంశాలపై ఇప్పుడు బెట్టింగులు జోరుగా సాగుతునట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా బెట్టింగ్ భూతానికి ప్రజలు దూరంగా వుండాలని పలువురు ఎంత చెబుతున్నా ఈ భూతం మాత్రం ఏదొక రూపంలో తిరుగుతూనే ఉందని మరోసారి రుజువైంది.