దేశమే కాక, ప్రపంచమంతా ఉత్కంఠతో, భక్తి పారవశ్యంతో ఎదురు చూసిన ఆ మహోజ్వల క్షణం,ఆ పవిత్ర సమయం రానే వచ్చింది. చరిత్రాత్మక దినం ఇది. 500 ఏళ్ళ నిరీక్షణ అనంతరం, 2024 జనవరి 22న రాముడు తిరిగి తన ఇంట్లో అడుగు పెట్టాడు. బాల రూపంలో రామ్ లల్లా గా ముద్దులు మూటగట్టే నీల మేఘ శ్యాముడు ధనుర్ధారియై బుడి బుడి అడుగులతో వచ్చి సరయూ నది ఒడ్డున ప్రజలు నిర్మించుకున్న తన ఆలయంలోకి వచ్చి కొలువు తీరాడు
మైసూర్ కి చెందిన అరుణ్ యోగిరాజ్ అనే శిల్పి కృష్ణ శిలతో చెక్కి, తీర్చి దిద్దిన బాల రాముడి విగ్రహం అత్యంత సుందరంగా తయారై, పిలిస్తే పలుకుతాడేమో అన్నంత సహజ కళలతో రూపొందింది. అరుణ్ కూడా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి అయోధ్య వచ్చాడు
ఇవాళ్టి తేదీని ప్రాణ పత్రిష్టకు ఎంచుకోవడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. ఈ రోజు కూర్మావతారం అవతరించిన రోజు. అందుకే విష్ణు స్వరూపుడైన శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టకు దశావతారాల్లో ఒకడైన కూర్మావతారం అవతరించిన రోజును ఎంచుకున్నారు.
దేశవ్యాప్తంగా 7 వేల మంది ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లాయి. వారందరి అడుగులూ అయోధ్య వైపు పరుగులెత్తాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని కోట్ల మంది ప్రజలు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారంలో తిలకించారు. టీవీ వార్తా చానెళ్ళన్నీ రాజకీయ వార్తలు మర్చిపోయి
స్రాముడి దివ్య స్వరూపాన్ని ప్రజలకు చూపడానికి పోటీలు పడ్డాయి.
అపరాహ్నం దాటాక 12.20 నుంచి 84 సెకన్ల పవిత్ర క్షణాల్లో అభిజిత్ లగ్నంలో బాల రాముడి విగ్రహంలో ప్రాణ ప్రతిష్ట జరిగింది. ఈ ప్రతిష్టలో ప్రధాన మంత్రి మోదీ పాల్గొన్నారు. ఉపవాస దీక్షలో ఉన్న ప్రధాని కొంత నీరసంగా ఉన్నా, బాల రాముడికి పట్టువస్త్రాలు, చత్రం , పాదుకలు తన చేతులతో మోసుకుంటూ తీసుకుని గుడి లో ప్రవేశించారు.
నల్లని ఆ దివ్య మంగళ విగ్రహం మీద బంగారు నగలు పసిడి కాంతులతో ప్రకాశించాయి. కుండలాలు, కిరీటం, ముత్యాల హారం, మరో పెద్ద హారంతో, నిలువు నామాలతో బాల రాముడు ఒక్క క్షణం శ్రీ వెంకటేశ్వరుడిని, మరో క్షణంలో పండరి నాధుడిని తలపిస్తూ వెలిగి పోయాడు
ఆకాశం నుంచి దేవతలు కురిపించినట్లే హెలికాప్టర్లు గులాబీ పూల వర్షాన్ని అయోధ్య అంతటా కురిపించాయి. జై శ్రీరామ్ అనే భక్తి పారవశ్య స్మరణతో అయోధ్య మాత్రమే కాక, ప్రపంచమంతటా హిందువుల స్వరాలు మారు మోగాయి.
తిరుముల నుంచి, హైద్రాబాద్ నుంచి, ఇతర ప్రాంతాల నుంచీ లక్షల్లో లడ్డూలు అయోధ్య వెళ్లాయి. సిరిసిల్ల నుంచి సీతా మహాలక్ష్మి కి బంగారు చీర వెళ్ళింది. నేపాల్ లో జనక్ పూర్ (సీత పుట్టిల్లు) నుంచి లారీల నిండా బహుమతులు అయోధ్య వచ్చాయి.
అయోధ్య మొత్తం కొన్ని గడియల పాటు త్రేతాయుగంలోకి ప్రయాణించింది. సరయూ నది తరగలు ఆనాటి వైభవాన్ని గుర్తు తెచ్చుకుని ఉరకలెత్తాయి
ప్రతిష్ట పూర్తి కాగానే హిందువులంతా తమ ఇళ్ళలో దీపాలు వెలిగించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి.
నిజానికి ఆలయ నిర్మాణం మొత్తం పూర్తి కాకుండానే బాల రాముడిని ప్రతిష్టించడం చేయడం ధర్మ విరుద్ధమని శంకరాచార్య వంటి వారు చెపుతున్నా, హడావిడి గా ఈ ప్రతిష్ట చేయడం ఎన్నికల కసరత్తే అనే విమర్శలు ఒక పక్క వెల్లువెత్తినా, కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగిపోయింది. ఎన్నికల కోడ్ వస్తే ఇటువంటి కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొనడం కుదరదు కాబట్టే, ఇంత త్వరగా ఈ ప్రతిష్ట జరిపించారని విమర్శలు వినవస్తున్నాయి.
ఏమైతేనేం? అనుకున్న పని జరిగింది. రాముడు వచ్చేశాడు. నిజానికి ఆయన ఎక్కడికెళ్లాడని? ఇపుడు ఆలయంలో ప్రతిష్టించారంతే
ఈ రోజు అయోధ్య మొత్తం దీపాలు వెలిగించారు. మొత్తం 14 లక్షల దీపాలతో అయోధ్య దీపోత్సవం జరుపుకుంటోంది.
రేపటి నుంచి సాధారణ భక్తులకు బాల రాముడు దర్శనమివ్వనున్నాడు. 35 అడుగుల దూరం నుంచి రాముడిని భక్తులు దర్శించుకుంటారు