ఏపీ ఫైబర్ నెట్ స్కామ్ లో పన్ను ఎగవేసినందుకు ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ (డీఆర్ఐ) చర్యలు తీసుకుంది. జీఎస్టీ నిబంధనలు పాటించకుండా రూ.10.81 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడిన ఫాస్ట్‌లేన్ టెక్నాలజీస్‌కు డీఆర్ఐ రూ.34 కోట్ల పెనాల్టీ విధించింది. కాగా ఫాస్ట్‌లేన్ టెక్నాలజీస్‌కు వెనుక ఉన్నది టెరాసాఫ్ట్ కంపెనీగా అధికారులు గుర్తించారు. ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా హవాలా మార్గంలో ఈ డబ్బును తరలించినట్లుగా ఆధారాలున్నాయి. గతంలో ఏపీ ఫైబర్ నెట్ నిధులను డొల్ల కంపెనీల ద్వారా పక్కదారి పట్టించి పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఫాస్ట్‌లేన్ మాజీ ఎండీ విప్లవ్‌కుమార్ విచారణలో వెల్లడించడం గమనార్హం.
అసలేం జరిగింది?
చంద్రబాబు హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా చౌక ధరలకే ఇంటర్నెట్ సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో అప్పటి ఏపీ ప్రభుత్వం టెండర్లకు పిలిచింది. కాగా టెరాసాఫ్ట్ కంపెనీ కోసం వారం రోజులు ఆలస్యంగా టెండర్లకు వెళ్లినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. కేవలం చంద్రబాబు సన్నిహితుడైన వేమూరి హరిప్రసాద్ కు టెండర్ కట్టబెట్టడం కోసమే జరిగిందని ఆరోపణలున్నాయి. బ్లాక్ లిస్టులో ఉన్న టెరాసాఫ్ట్ సంస్థకు టెండర్ కట్టబెట్టడంలో చంద్రబాబు, లోకేష్ హస్తం ఉందని ప్రచారం కూడా జరిగింది. గతంలో పౌర సరఫరాల శాఖకు నాసిరకమైన ఈ-పోస్ పరికరాలు సరఫరా చేసినందుకు టెరాసాఫ్ట్ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టిన రెండు నెలల్లోనే బ్లాక్ లిస్ట్ నుండి తప్పించి ఏపీ ఫైబర్ నెట్ టెండర్ ని అప్పగించడం వెనుక చంద్రబాబు , లోకేష్ పాత్ర ఉందని అనుమానాలున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో హవాలా రూపంలో డొల్ల కంపెనీల ద్వారా కోట్ల రూపాయల నగదు చేతులు మారిందని సీఐడీ ఆరోపిస్తుంది.
కాగా టెరాసాఫ్ట్ ఎండీ తుమ్మల గోపిచంద్ విజ్ఞప్తి మేరకే ఫాస్ట్‌లేన్ టెక్నాలజీస్ కంపెనీని ఏర్పాటు చేసినట్లు విప్లవ్ కుమార్ విచారణలో వెల్లడించాడు. 2020 సెప్టెంబర్ నెల నుండి ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకపోవడంతో ఫాస్ట్‌లేన్ కంపెనీ రిజిస్ట్రేషన్ ప్రభుత్వం రద్దు చేసింది. గతంలో ఏపీ ఫైబర్ నెట్ కేసులో వేమూరి హరి ప్రసాద్, తుమ్మల గోపిచంద్ కి ముందస్తు బెయిల్ మంజూరు కాగా చంద్రబాబు బెయిల్ పిటిషన్ డిసెంబర్ 12 న సుప్రీంకోర్టులో విచారణకు రానుంది.