మరో ప్రముఖ కొరియోగ్రాఫర్ దర్శకుడిగా మారనున్నారు. ఇప్పటికే లారెన్స్, ప్రభుదేవా, అమ్మ రాజశేఖర్, విజయ్ బిన్నీ లాంటి వాళ్ళు కొరియోగ్రాఫర్ నుండి దర్శకుడిగా మారిన వాళ్లే. కాగా వీరిలో లారెన్స్, ప్రభుదేవా వరుస విజయాలతో స్టార్ దర్శకులుగా మారిపోయారు. అమ్మ రాజశేఖర్ అవకాశాల వేటలో వెనుకబడగా విజయ్ బిన్నీ మాత్రం ‘నా సామి రంగా’ తో తొలి ప్రయత్నంలోనే హిట్ కొట్టారు. తాజాగా ఇప్పుడా కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ల జాబితాలోకి గణేష్ మాస్టర్ కూడా చేరిపోయారు.
ఇప్పటికే ఎన్నో హిట్ పాటలకు కొరియోగ్రఫీ చేసిన గణేష్ మాస్టర్ ‘గౌడ్ సాబ్’ అనే సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమవుతున్నారు. ప్రభాస్ కజిన్ అయిన విరాట్ రాజ్ ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతుండడం విశేషం. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంఛ్ కాగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సినిమా టైటిల్‌ను ఆవిష్కరించిన సుకుమార్ మాట్లాడుతూ గౌడ్ సాబ్ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందంటూ ఆకాంక్షించారు. మల్లీశ్వరి సమర్పణలో శ్రీపాద ఫిలింస్ బ్యానర్‌పై ఎస్ఆర్ కళ్యాణమండపం రాజు, కల్వకోట వెంకట రమణ, కటారి సాయికృష్ణ కార్తీక్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ఆర్ఎం స్వామి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.