హిట్ అనే పదానికి దూరమై చాలాకాలం అయినా కూడా ఆది సాయి కుమార్ చేతినిండా సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తూనే ఉన్నాడు. తాజాగా కృష్ణ ఫ్రమ్ బృందావనం అనే మరో కొత్త సినిమాతో పలకరించబోతున్నాడు. నేడు పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను ప్రారంభించడం విశేషం. కాగా ఈ చిత్రానికి వీరభద్రం దర్శకత్వం వహిస్తున్నాడు.
గతంలో ఆది సాయి కుమార్, వీరభద్రం కాంబోలో చుట్టలబ్బాయ్ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అనిపించుకుంది. తాజాగా వీరిద్దరూ మరోసారి జట్టు కట్టడంతో ఈసారి ఆది సాయి కుమార్ ఖచ్చితంగా హిట్ ట్రాక్ ఎఎక్కే అవకాశం ఉందనే అంచనాలు మొదలయ్యాయి. లక్ష్మీ ప్రసన్న ప్రొడక్షన్స్ బ్యానర్ మీద తూము నరసింహా, జామి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో దిగంగనా సూర్య వంశీ హీరోయిన్గా కనిపించనున్నారు. కాగా ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించనున్నారు. ఆది, అనూప్ కాంబోలో గతంలో ప్రేమ కావాలి, లవ్ లీ, సుకుమారుడు వంటి సూపర్ హిట్ ఆల్బమ్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా యువతరాన్ని ఊపేసిన ప్రేమ కావాలి పాటలు అప్పట్లో కలిగించిన సంచలనం అంతా ఇంతా కాదు.
కృష్ణ ఫ్రమ్ బృందావనం పూజా కార్యక్రమాల్లో ముహూర్తపు సన్నివేశానికి దిల్ రాజు క్లాప్ కొట్టగా స్క్రిప్ట్‌ని అందజేస్తూ సాయి కుమార్ కెమెరాను స్విచ్ ఆన్ చేశారు. ఫస్ట్ షాట్‌కి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. విలేజ్ డ్రామా, ఫ్యామిలీ, లవ్, కామెడీ, ఫీల్ గుడ్ ఎమోషన్ ఇలా అన్ని అంశాలతో సినిమాను చేస్తున్నామని ఈ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలంటూ సాయికుమార్ ఆశీర్వదించగా ఈ సినిమా రెగ్యులర్ షూట్ ను జూన్ నుంచి ప్రారంభించనున్నారు.