ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అటు కూటమి , ఇటూ వైసీపీరెండు పనిచేశాయి. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో మాత్రం ఎన్నికల వేల చెలరేగిన హింస ఎన్నికల ప్రక్రియనే అవహేళన చేసేవిగా ఉన్నాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు. అయితే ఎన్నికలు ముగిసిన అనంతరం ఎన్నికల కమీషన్ మాత్రం చెదురు మదురు ఘటనలే జరిగాయని ఎక్కాడా రీపోలింగ్ కు ఆస్కారం లేదని తేల్చి చెప్పింది. ఎన్నికల సమయంలో ఎక్కడైతే అధికారులని బదిలీ చేసి కొత్త వారిని నియమించారో అక్కడే అల్లర్లు జరిగాయని, పోలింగ్ బూతుల్లో రిగ్గింగులు చేస్తున్నారని పోలీసులకి ఫోను ద్వారా లేఖల ద్వారా ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడంలేదని వైసీపీ నేతలు మొదటి నుండి ఆరోపిస్తూ వస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఎన్నికలు జరిగిన వారం తరువాత ఎన్నికల కమీషన్ దగ్గర ఉండాల్సిన మాచర్ల, పాల్వాయి గేట్ పోలింగ్ బూత్ సీసీ టీవీ ఫుటేజ్ ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియా ఖాతాల్లో చెక్కర్లు కొడుతుంది. మొత్తం సీసీటీవి ఫుటేజ్ విడుదల చేయకుండా కేవలం ఫోన్ ద్వారా 20 సెకన్లు నిడివిగల వీడియోని మాత్రమే కట్ చేసి టీడీపీ వారు వదిలినట్టు స్పష్టంగా అర్ధమవుతుంది. సదరు వీడియోలో మాచర్ల శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి ఈవీఎం ను ధ్వంసం చేసినట్టు రికార్డై ఉంది. అయితే దానికి ముందు అదే పోలింగ్ బూత్ లో వైసిపీ ఏజెంటుపై టీడీపీ వారు బౌతిక దాడి చేసి పోలింగ్ బూత్ నుండి బయటికి లాగేసిన వీడియోని మాత్రం ఉద్దేశపూర్వకంగా దాచినట్టు స్పష్టమవుతుంది.
నిజంగానే పిన్నెల్లి వెళ్ళి సజావుగా సాగుతున్న పోలింగ్ ని అడ్డుకున్నట్లైతే దానికి ముందు ఉన్న వీడియో ఎందుకు బయటికి రాలేదు? ఎన్నికల కమీషన్ దగ్గర ఉండాల్సిన వీడియో టీడీపీకి ఎలా వచ్చింది. ఎవరు ఈ కుట్రకు సూత్రధారులు? అదే పాల్వాయి గేటు పోలింగ్ బూతులో రిగ్గింగు జరుగుతుందని పోలీసులకి ఎన్నికల సమయంలోనే లేఖలు రాసినా ఎందుకు పోలీసులు పట్టించుకోలేదు? ఎన్నికల అనంతరం సీఈఓ ముఖేష్ కుమార్ మీనా మీడియా పాయింట్ లో మాట్లాడుతూ మాచర్లలో 8 పోలింగ్ కేంద్రాలో, కోడూరులో 2 ఈవీఎంలు ధ్వంసం అయినట్టు ప్రకటించారు. మిగిలిన 9 ఈవీఎంలను పగలకొట్టిన వీడియోలు ఎందుకు బయటికి రాలేదు? లాంటి అనేక సహేతుకమైన ప్రశ్నలకు ఎన్నికల కమీషన్ దగ్గర సమాధానం ఉందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. సామాన్యులు లేవనెత్తిన ఈ ప్రశ్నలకు సరైన సమాధానం ఎన్నికల కమీషన్ ఇవ్వగలిగితే కుట్ర కోణం బయటపడుతుందని పలువురు అభిప్రాయాపడుతున్నారు.