భారతదేశంలో బీహార్, గుజరాత్, మిజోరాం, నాగాలాండ్ రాష్ట్రాల్లో మద్యపాన నిషేధం అమలులో ఉంది. కాగా గుజరాత్ రాష్ట్రం ఏర్పడిన నాటినుండే ఆ రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలులో ఉంది. కాగా తాజాగా గుజరాత్ రాష్ట్రంలో మద్య నిషేధాన్ని సడలిస్తూ బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజకీయ ప్రకంపనలకు కారణమైంది. వివరాల్లోకి వెళితే
గాంధీనగర్‌లోని మొట్టమొదటి దేశీయ ఆర్థిక సేవల కేంద్రం గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్-సిటీ (గిఫ్ట్)లో మద్యం సేవించేందుకు గుజరాత్ ప్రభుత్వం అనుమతించడం సంచలనానికి కారణమైంది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, అంతర్జాతీయ హబ్‌లతో పోటీ పడేందుకు గుజరాత్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ పెట్టుబడిదారులు, జాతీయ, అంతర్జాతీయ కంపెనీలకు ప్రపంచస్థాయి అనుకూల వ్యాపార వ్యవస్థను అందించడానికి గిఫ్ట్ సిటీ ప్రాంతంలో
‘వైన్ అండ్ డైన్’ సౌకర్యాలను అనుమతించేందుకు గుజరాత్ ప్రభుత్వం నిబంధనలు సడలించడం గమనార్హం. గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్-సిటీ (గిఫ్ట్) లో పనిచేసే వ్యక్తులందరికీ మద్యం వినియోగించే అనుమతితో పాటు హోటళ్లు, రెస్టారెంట్లు లేదా క్లబ్‌లలో మద్యం సేవించేందుకు వీలుగా కొన్ని నిబంధనలను నార్కోటిక్స్ అండ్ ఎక్సైజ్ విభాగం రూపొందించింది.
అగ్రశ్రేణి ప్రపంచ సంస్థలను ఆకర్షించడం కోసం బీజేపీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నాయి. గాంధీ పుట్టిన రాష్ట్రంలో మద్యపానానికి అనుమతివ్వడం ఏంటని మండిపడుతున్నాయి. మహాత్మా గాంధీ పుట్టిన రాష్ట్రంగా అరవై ఏళ్లుగా సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తున్న గుజరాత్ రాష్ట్రం, బీజేపీ తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల అభివృద్ధి జరిగినా యువత నష్టపోతుందని విమర్శిస్తున్నాయి.