భారత స్వాతంత్రోద్యమంలో సుభాష్ చంద్రబోస్ పోరాటం అసామాన్యమైనది. ఒక పక్క అహింస ద్వారానే భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధిస్తుందని బలంగా నమ్మిన గాంధీ ఆ దిశలో పోరాటం చేస్తుంటే మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తానని పోరాటం చేసిన సమరయోధుడు సుభాష్ చంద్రబోస్.. నేడు ఆయన జయంతి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జనవరి 23, 1897న కటక్ లోని ఓ ధనిక కుటుంబంలో జన్మించారు. 1920 లో బోస్ భారతీయ సివిల్ సర్వీసు పరీక్షలకు హాజరై అందులో నాలుగవ స్థానంలో నిలిచాడు. 1921 ఏప్రిల్లో ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ సివిల్ సర్వీసు నుండి వైదొలగి స్వతంత్ర పోరాటంలో సుభాష్ చంద్రబోస్ పాల్గొన్నారు.
మానవసేవే మధనసేవ అంటూ వివేకానందుడి మార్గంలో పయనించిన నేతాజీ, జలియన్ వాలా బాగ్ ఉదంతం అనంతరం యుద్ధమే శరణం అంటూ ఆంగ్లేయులను గడగడలాడించారు. రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెస్ కి అధ్యక్షుడిగా ఎన్నికైనా గాంధీతో సిద్ధాంత పరమైన అభిప్రాయ భేదాల వలన ఆ పదవికి రాజీనామా చేశారు. ఇద్దరి సిద్ధాంతాలు వేరువేరు అయినా గాంధీ, నేతాజీకి మధ్య మంచి సంబంధాలు ఉండేవి. గాంధీకి జాతిపిత అనే బిరుదును ఇచ్చింది నేతాజీనే. స్వతంత్ర పోరాటంలో 11సార్లు జైలుకు వెళ్లిన నేతాజీ ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించారు. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా శత్రుదేశాలతో సైతం నేతాజీ చేతులు కలపడం గమనార్హం.
మోహన్ సింగ్ దేవ్ సెప్టెంబర్ 1942 తేదీన సింగపూర్లో స్థాపించిన భారత జాతీయ సైన్యం బోస్ రాకతో సరికొత్త రూపుకి మారింది. బోస్ పిలుపుతో చాలా మంది దేశ భక్తులు సైన్యంలో చేరడమే కాకుండా దానికి ఆర్థిక సహాయం కూడా అందించారు. జపాను ప్రభుత్వం అందించిన సైనిక, ఆర్థిక, దౌత్య సహకారాలతో ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని సింగపూర్ లో ఏర్పరచారు. కాగా బోస్ ను హత్య చేయడానికి నాటి బ్రిటిష్ ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. కాగా ఆయన మరణం మాత్రం మిస్టరీగా మిగిలిపోయింది. బోస్ ఆగష్టు 18, 1945లో తైవాన్ మీదుగా టోక్యోకు ప్రయాణిస్తుండగా విమాన ప్రమాదంలో మరణించారని వార్తలు వచ్చినా ఆయన మృతదేహం మాత్రం కనుగొనబడలేదు. దీని వల్ల ఆయన బతికి ఉండవచ్చునని ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. బోస్ జయంతిని భారత ప్రభుత్వం పరాక్రమ్ దివస్ గా నిర్వహిస్తోంది. సుభాష్ చంద్రబోస్ జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పించారు.