ఈ సినిమా గురించి చెప్పుకోడానికేమీ లేదు. వివరిస్తూ రివ్యూ రాయడానికి ఇందులో కథ ఏమీ లేదు. అందరూ రివ్యూలు రాసినట్టే సినిమా నిండా హింస, రక్తం, నగ్నత్వం!
“కబీర్ సింగ్ నచ్చలేదా? దాని తాత లాంటి సినిమా తీసి చూపిస్తా. దాని ముందు కబీర్ సింగ్ నథింగ్ అనే లాటి సినిమా” అని పంతంతో తీసిన సినిమా
కబీర్ సింగ్ సినిమా రిలీజ్ అయిన సందర్భంలో జర్నలిస్ట్ అనుపమా చోప్రా అతన్ని ఇంటర్వ్యూ చేసినపుడు “మీ రాబోయే సినిమా మీద విమర్శలు కొంత తగ్గుతాయని అనుకోవచ్చా?” అని ఆమె అడిగింది. దానికి అతడు ” దాని మీద ఇంకా ఎక్కువ విమర్శలు వస్తాయి. కబీర్ సింగ్ సినిమాలో హింస ఎక్కువ ఉందన్న వాళ్లకి అసలు, హింస అంటే ఏంటో, ఎలా ఉంటుందో నా తర్వాత సినిమాలో చూపిస్తా” అని సవాల్ చేశాడు. దాని ఫలితమే ఈ యానిమల్ సినిమా.
అమీర్ ఖాన్ కొన్నేళ్ళ క్రితం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఇలా అన్నాడు. “కథను చిక్కగా రాసుకోవడం చేతగాని దర్శకుడు, ప్రేక్షకుల ఎమోషన్స్ ని బాగా రెచ్చగొట్టే రెండింటిని ఎంచుకుంటాడు, అవి సెక్స్, హింస.”
ఈ మాటలు యానిమల్ సినిమాకి సరిగ్గా సరి పోతాయి.
“కేవలం హింసను ప్రమోట్ చేయడానికే ఈ సినిమాని తీశాను” అని దర్శకుడు ప్లెయిన్ గా చెప్పేసి ఉంటే బాగుండేది. కానీ అతను ఒక ప్రముఖ హీరో నడిపే టీవీ షో లో “హీరోకి తండ్రి అంటే పిచ్చి. తండ్రి కోసం ఒక కొడుకు ఎంత దూరం వెళ్తాడనేది ఈ సినిమాలో చూపించాను” అని, ఈ సినిమాకి ‘కొడుకు ప్రేమ’ అనే షుగర్ కోటింగ్ ఇచ్చాడు.
సినిమాలో కథానాయకుడి పాత్రను తయారు చేసేటపుడు దర్శకుడు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. అతడికి అలివి మాలిన డబ్బు ఉండటం మొదటిది. డబ్బున్న వాడు ఏం చేసినా చెల్లుతుందనేది దర్శకుడు ఇచ్చే సందేశం .అలాగే యానిమల్ అనే పేరు పెట్టాడు కాబట్టి అతడు మనిషిలా ప్రవర్తించని సన్నివేశాలను మనం ప్రశ్నించడానికి వీల్లేదన్నమాట.
ఎన్ని చెప్పినా కథా నాయకుడు కూడా మనిషే కాబట్టి ఆ కోణంలోనే ప్రేక్షకుడు చూస్తాడనేది డైరెక్టర్ అర్థం చేసుకోవాలి.
రణవీర్ సింగ్ లో అనేక షేడ్స్. కాలేజీలో అక్కని ఎవరో ఏడిపిస్తే, గూట్లో సిగరెట్ తీసినట్టు ఒక మెషిన్ గన్ తీసుకుని టపటపా కాల్చడానికి పోతాడు. అక్క మీద బావ చెయ్యి చేసుకోబోతే చంపినంత పని చేస్తాడు. అతడు మాత్రం తన భార్యను శారీరకంగా, ,మానసికంగా హింసిస్తుంటాడు. బ్రా స్ట్రాప్ లాగిలాగి వదిలి ఎర్రటి అచ్చులు పడేలా చేసి, ఆమె ఆ బాధలో ఉండగానే వెంటనే సెక్స్ కి సిద్ధమవుతాడు.
దర్శకుడి ఒక పాత ఇంటర్వ్యూ ఇప్పుడు ఇంటర్నెట్ లో తిరుగుతోంది. అందులో అతను అన్నాడు, “నీ భార్య/ప్రియురాలిని లాగి ఒకటి కొట్టక పోతే, నీకిష్టమైన (ఆమెకిష్టమైనా లేకపోయినా సరే) చోట తాకకపోతే, బూతులు తిట్టకపోతే, అది ఎమోషన్ ఎలా అవుతుంది?” అని .
ఎమోషన్ కి అతని నిర్వచనం అది. ఆ నిర్వచనానికి అనుగుణంగా ఈ సినిమాలో రణవీర్ ప్రవర్తిస్తాడు. ఒక డిస్ఫంక్షనల్ ఫ్యామిలీలో పెరిగిన డిస్ఫంక్షనల్ కిడ్ అతను. “నేను బరువు తగ్గాను” అని చెప్పడానికి బట్టలు విప్పేసి తోటలో తిరుగుతాడు. ఇతని మానసిక స్థితి సరిగా లేదని నిరూపించే సన్నివేశాల్లో ఇదొకటి. అతడి మానసిక స్థితి తెలుసుకోడానికి వచ్చిన సైకాలజిస్ట్ ని అసభ్యంగా మాట్లాడతాడు.
ఇవన్నీ జంతు లక్షణాలు కాబట్టి దర్శకుడు సినిమాకి “యానిమల్” అని పేరు పెట్టాడు గానీ, నిజానికి అది అత్యంత దారుణమైన పొరపాటు, తప్పు కూడా
సృష్టి లోని ఏ జంతువైనా రెండే సందర్భాల్లో క్రూరంగా ప్రవర్తించి హింసకు తెగబడుతుంది. ఆకలి, ఆత్మ రక్షణ.
ఆకలి తీరిన ఎంతటి క్రూర జంతువైనా నువ్వు పక్క నుంచి పోతుంటే నీ జోలికి రాదు. కానీ ఈ సినిమా కథానాయకుడు అలా కాదు. వందల మందిని షూట్ చేసి, నరికి, గొంతులు కోసి రక్తం బకెట్లకు ఎత్తుతాడు. సినిమా లాజిక్ ప్రకారం ఒక్క పోలీసు కూడా తొంగి చూడడు. చిన్న రివాల్వర్ కి కూడా లైసెన్స్ తప్పనిసరి అయ్యిన ప్రజాస్వామ్య దేశంలో హెవీ లోడెడ్ మెషిన్ గన్స్ ఫిట్ చేసి ప్రత్యేకంగా తయారు చేసిన వెహికల్ ని చాక్లెట్ బాక్స్ కొన్నంత తేలికగా కొనటం, కొన్న చోటే దానితో మందలు మందలు జనాన్ని చంపటం చేసినా కనీసం పోలీసు విచారణ జరిగిన సన్నివేశం ఒక్కటైనా పెట్టకపోవడం విచిత్రం .
కొంతమంది ప్రేక్షకులు దర్శకుడు చాలా బోల్డ్ అని మెచ్చుకోవడం కనపడింది. ఎందుకంటే ఇతను “అల్ఫా మేల్” అనే కాన్సెప్ట్ ని శక్తికి, హింసకీ, పిచ్చి కి ప్రతీక గా చూపిస్తూ దాన్ని ప్రేక్షకుల మెదళ్ళలో నాటడానికి విశ్వ ప్రయత్నం చేశాడు.
అతను నిజానికి బోల్డ్ కాదు, ప్రోగ్రెసివ్ అంతకంటే కాదు. అతని భావ జాలం యుగాల నాటిది. ధనమూ, మదమూ ఉంటే ఎంతమందినైనా చంపి పారేయొచ్చనీ,తాను వివాహేతర బంధాల్లోకి దొగొచ్చు గానీ భార్య మాత్రం తను పోతే రెండో పెళ్ళి చేసుకోకూడదనీ, హింసతో ఎవరినైనా, దేన్నయినా గెలవొచ్చనీ అనుకునే మూర్ఖుడిని కథానాయకుడిగా చిత్రించాడు. స్త్రీలు భర్తలు పెట్టే హింసను నోరు మూసుకుని పడుండి భరించాలని సదేశమిచ్చాడు దర్శకుడు. కథా నాయకి, కథానాయకుడి అక్క పాత్రలు రెండూ దీనికి ఉదాహరణలు.
మరి ఈ సినిమా కి ఇంతమంది ప్రేక్షకులు ఎలా బయలు దేరారు? ఇన్ని డబ్బులు ఎలా వచ్చాయి?
ఇది కూడా దర్శకుడు పన్నిన వలే. అతను సృష్టించిన భీభత్సం సగటు ప్రేక్షకుడికి ఒక షాక్ వాల్యూ లాంటిది .అది రేకెత్తించిన అభ్యంతరాలూ, ప్రశ్నలూ, స్త్రీలలో పుట్టించిన ఆందోళనా, ఆగ్రహం, ఇవన్నీ మల్టిపుల్ అంశాలు. వీటి మీద ప్రేక్షకులు పలు వర్గాలు గా చీలి పోయి చర్చించుకున్నారు. వాదించుకున్నారు.
ఈ చర్చలు, వాదనల వల్ల సినిమా చూడని ప్రేక్షకుల్లో ఒక ఆందోళన బయలు దేరింది. దాన్ని ఇంగ్లీష్ లో Fఓంఓ అంటారు. అంటే Fఏర్ ఓఫ్ ంఇస్సింగ్ ఓఉత్. ఆ సినిమా చూడక పోవడం వల్ల తాము ఏదో మిస్ అయిపోతున్నామని, కోల్పోతున్నామనే కంగారు లో అందరూ థియేటర్ల వైపు పరుగులెత్తారు. సినిమా చూసిన సగం మంది ప్రేషకులు ఈ కోవకు చెందిన వాళ్ళే.
సినిమా ఎంత కలెక్షన్ సంపాదించినదనే దాని కంటే సినిమా ఏమి చెపుతోంది, ప్రేక్షకుల మీద దాని ప్రభావం ఎలా ఉంటుదన్నది ముఖ్యమైన చర్చనీయాంశం.
ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న పదం “అల్ఫా మేల్”. నిజానికి ఆ పదానికి ఉన్న అసలు అర్థం వేరు, ఈ సినిమా దర్శకుడు దాన్ని ప్రొజెక్ట్ చేసి, ప్రేక్షకుల్లో ఇంజెక్ట్ చేసిన అర్థం వేరు. దీని వల్ల జరగబోయే అనర్థాలు త్వరలోనే మనకి తెలుస్తాయి.
అంతే కాదు, ఈ సినిమా తర్వాత ఇతని రాబోయే సినిమా “యానిమల్ పార్క్” అంటే ఒకటి కంటే ఎక్కువ యానిమల్స్ ఉంటాయన్నమాట
సో, మల్టిపుల్ జంతువులను ఎదుర్కోవడానికి ప్రేక్షకులు టికెట్ డబ్బుతో రెడీగా ఉండాలి.
రాబోయే రోజుల్లో ఈ సినిమా స్ఫూర్తి తో మరిన్ని హింసాత్మక సినిమాలు వస్తాయి.ఎంతోమంది ఇతని బాటలో నడుస్తారు. పర్యవసనాలు ఏమిటో కాలమే తేలుస్తుంది